Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓ తండ్రిగా రమ్య పెళ్ళి చేయాలనుకోవడం తప్పా?: ఎమ్మెల్యే నాని

తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే ఈలి నాని కుమార్తె రమ్య వ్యవహారం సుఖాంతమైనా, ఆమె కుటుంబంలో మాత్రం వాడివేడి చల్లారలేదు. తండ్రీ కుమార్తెలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వీరి మధ్యలో మరో వ్యక్తి సందీప్. రమ్య తన అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించి ఇంట్లోంచి వెళ్ళిపోయి, తనను అనాథను చేసిందని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరిగాక అందరూ తనపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారని, అది చూస్తుంటే, తన ఇంట్లో ఎవరో చనిపోయిన భావన కలుగుతోందని ఆయన గద్గదస్వరంతో వ్యాఖ్యానించారు. ఓ తండ్రిగా మన సంస్కృతి ప్రకారం ఆమె పెళ్ళి చేయాలనుకోవడం తప్పా? అని నాని ప్రశ్నించారు.

ఈ సంఘటనపై పలు చానళ్ళు చిలవలు పలవలుగా ప్రసారం చేశాయని ఆరోపించారు. కిడ్నాప్ కు పాల్పడినట్టు, వేధింపులకు గురిచేసినట్టు వాటిలో స్క్రోలింగ్ లు వచ్చాయని తెలిపారు. కాగా, తండ్రి వాదనపై కుమార్తె రమ్య స్పందిస్తూ, తన భర్త కోసమే తాను ఇంట్లోంచి బయటకు వచ్చానని చెప్పారు. నాలుగేళ్ళుగా గృహ నిర్భంధంలో ఉంచారని, రెండో పెళ్ళి చేసే ప్రయత్నం చేస్తుంటే విధిలేని పరిస్థితుల్లో కోర్టు గడప తొక్కానని వివరించారు. ఇప్పటికైనా తనపై ప్రేమ ఉంటే తన తండ్రి తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఇక రమ్య భర్త సందీప్ మాట్లాడుతూ, 2008లో ప్రేమ వివాహం చేసుకుని సిమ్లాలో ఉన్న తమని నిర్దాక్షిణ్యంగా విడదీశారని ఆరోపించారు.

More Telugu News